కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీలో సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ మిగిలారు. తమ ఇద్దరిదీ ఫ్రెండ్లీ పోటీ అంటూనే థరూర్ మెల్లగా ఖర్గేపై సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న సిస్టం లో ఖర్గే లాంటి నేతలు మార్పులు తేలేరని ఆయన వ్యాఖ్యానించారు. కానీ తమ ఇద్దరిమధ్యా విరోధం లేదని కూడా అన్నారు. నాగ్ పూర్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తామేమీ శత్రువులం కామని, ఇది యుద్ధం కాదని, ఇది కాంగ్రెస్ భవితవ్యానికి ఎన్నిక అని పేర్కొన్నారు. పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్న ముగ్గురు నేతల్లో మల్లిఖార్జున్ ఖర్గే ఒకరని, ఇలాంటి నాయకులు పార్టీ వ్యవస్థలో మార్పులు తేజాలరని ఆయన చెప్పారు.
‘ఈ సిస్టం ఇలాగే కాంగ్రెస్ లో కొనసాగుతుంది.. కానీ నేను మాత్రం పార్టీ కార్యకర్తలు ఆశించిన విధంగా మార్పులు తెస్తా’ అని థరూర్ పేర్కొన్నారు. మీరు పార్టీ ప్రస్తుత సిస్టం తో సంతృప్తి పడితే ఖర్గేను ఎన్నుకోండి.. మార్పు కావాలంటే నన్ను ఎన్నుకోండి అని ఆ తరువాత పార్టీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ, రాహుల్ లేదా ప్రియాంక గాంధీ గానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎవరికీ మద్దతునివ్వడం లేదని తెలిపారు. తన ఎన్నికల ప్రచారాన్ని శశిథరూర్ నిన్న నాగ్ పూర్ లోని దీక్షాభూమి నుంచి ప్రారంభించారు. ఇక్కడ 1956 లో బీ.ఆర్. అంబేద్కర్ తన సహచరులతో బాటు బుద్ధిజం స్వీకరించారు.
‘జీ-23 క్యాంప్ లేదు..నాకు చాలామంది మద్దతు ఉంది’.. మల్లిఖార్జున్ ఖర్గే
ఒకప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కి లేఖ రాసిన ‘జీ-23’ గ్రూపు ఇప్పుడు లేదని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. వాళ్లంతా బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని సమైక్యంగా ఎదుర్కోవాలని భావిస్తున్నారని, పైగా తనకు మద్దతునిస్తున్నారని ఆయన చెప్పారు. తనఅభ్యర్థిత్వాన్ని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సపోర్ట్ చేస్తున్నారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. సీనియర్లు, యువకులనందరినీ అభ్యర్థించిన తరువాతే ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నానన్నారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే బరిలోకి దిగానని ఖర్గే తెలిపారు.