వైద్యులు చేసే రకరకాల ఆపరేషన్లకు గాను కోలుకునేందుకు రోగులకు కొద్ది రోజుల సమయం పడుతుంది. చేసే ఆపరేషన్‌ను బట్టి కోలుకునే సమయం పెరగవచ్చు. అయితే ఆ మహిళ మాత్రం 5 ఏళ్లుగా హాస్పిటల్‌లోనే ఉంది. అవును.. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు హాస్పిటల్‌లో ఉన్న మహిళగా ఆమె వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఆ హాస్పిటల్ వారే. ఆమె అలా ఉండడం వల్ల ఆమె, ఆమె కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం.
బెంగళూరులోని యాక్సెంచర్ కంపెనీలో పనిచేసే పూనమ్ అనే మహిళ అక్టోబర్ 2015వ తేదీన అక్కడి మణిపాల్ హాస్పిటల్‌లో కడుపునొప్పితో చేరింది. అయితే వైద్యులు చేసిన తప్పిదం వల్ల ఆమెకు జీర్ణవ్యవస్థలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆమె అప్పటి నుంచి మంచానికే పరిమితం కావల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5 ఏళ్ల పాటు ఆమెకు వైద్యులు ట్రీట్‌మెంట్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఆమె కోలుకోలేదు. దీంతో అత్యంత సుదీర్ఘకాలం పాటు ఆమె హాస్పిటల్‌లో ఉంటూ వస్తోంది. ఇక ఆమె చికిత్సకు ఇప్పటి వరకు రూ.6 కోట్ల బిల్ అయింది. కాగా ఆమె భర్త రిజీష్ నాయర్, కుటుంబ సభ్యులు కలిసి ఆమె హాస్పిటల్ చికిత్సకు ఇప్పటి వరకు రూ.1.34 కోట్ల బిల్లును చెల్లించారు. అయితే ఇక వారికి ఓపిక నశించింది. దీంతో వారు హాస్పిటల్‌పై న్యాయ పోరాటానికి దిగారు.
ఆ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే పూనమ్ ఇన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందాల్సి వస్తుందని, కనుక హాస్పిటల్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను కూడా కలిశారు. ఇక ఆమెకు ఇప్పటి వరకు 20 మందికి పైగా వైద్యులు చికిత్సను అందించారు. ఎన్నో రకాల మెడిసిన్లను ఇచ్చారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు. బెడ్‌పైనే అచేతనంగా ఉంటోంది. ఆమె ప్రస్తుతం మాట్లాడలేదు. నడవలేదు. ఏదైనా చెబితే కొంత సేపటికి స్పందిస్తుంది. అంతటి దయనీయ స్థితిలో ఆమె ఉంది.
కాగా ఈ విషయంపై ఆ హాస్పిటల్ యాజమాన్యం స్పందిస్తూ.. పూనమ్ హాస్పిటల్‌లో చేరినప్పుడే తీవ్రమైన అనారోగ్య సమస్యతో చేరిందని, ఆమె భర్త, కుటుంబ సభ్యులు తమపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. ఆమె భర్త, కుటుంబ సభ్యులకు ప్రతి విషయాన్ని చెబుతూనే వారి అంగీకారం మేరకే మందులను వాడుతూ చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అయితే ఆమె కండిషన్ అసలు ఏమిటి ? ఇంతకీ అసలు ఆమెకు క్యూర్ అవుతుందా ? లేదా ? అన్న విషయాన్ని మాత్రం వైద్యులు వెల్లడించలేదు. కానీ ఆమె లాంటి అనారోగ్య సమస్య ఉన్నవారు మాత్రం కోలుకునేందుకు 3 నెలల వరకు సమయం పడుతుందని ఇతర హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు తెలిపారు. కానీ ఈమెకే ఎందుకింత సమయం పడుతుంది ? అన్నది మాత్రం అర్థం కాని విషయం. దీనికి ఆ హాస్పిటల్ వారే సమాధానం చెప్పాలి.