టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ వ్యవహారంలో గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమ్ముడి పేరుతో రేణుక దంపతులు ప్రశ్నాపత్రాలు సంపాదించేందుకు తెరవెనుక పెద్ద తతంగమే నడిపారు.
పరీక్ష రాసేందుకు అర్హత లేని తమ్ముడిని చూపించి ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేశారు. ప్రధాన నిందితుడు, కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ కుమార్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ రాజశేఖర్ సహాయంతో అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ ప్రశ్నాపత్రాలు దక్కించుకొని లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇక పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. అసలు రేణుక తమ్ముడు రాజేశ్వర్ నాయక్ ఏఈ పరీక్ష రాసేందుకు అర్హుడే కాదని పోలీసులు గుర్తించారు. టీటీసీ పూర్తి చేసిన రాజేశ్వర్ స్వగ్రామంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. ఈయన పేరు చెప్పి ఏఈ ప్రశ్నాపత్రాలు దక్కించుకున్న రేణుక వీటిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కె. నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ కు ఇచ్చేలా 14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న రేణుక మొదటగా ఈ నెల 2న బాలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ప్రవీణ్ కు 5 లక్షలు ఇచ్చింది.
ఆ తర్వాత అదే ప్రశ్నాపత్రాన్ని 14 లక్షలు తీసుకొని ఎల్బీనగర్ లోని ఓ లాడ్జిలో ఉన్న నీలేశ్, గోపాల్ కు అప్పగించింది. వారు ఆ పేపర్ లోని ప్రశ్నలు తెలుసుకొని ప్రిపేర్ అయి పరీక్ష రాసేలా ప్రణాళిక రచించారు. ఆ తర్వాత పరీక్ష ముగిశాక ఏమాత్రం అనుమానం రాకుండా ఒప్పందం మేరకు మిగిలిన 5 లక్షలతో పాటు ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ కు అప్పగించింది. అయితే ఈ వ్యవహారంలో సోదరుడు రాజేశ్వర్ నాయక్ కు కూడా ఎంతో కొంత ముట్టచెప్పేలా అంగీకారం కుదిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో వైపు ఈ కేసులో మేడ్చల్ జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కెతావత్ శ్రీనివాస్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పోలీసు ఉద్యోగంలో ఉండి కళ్లెదుట జరుగుతున్న నేరంపై మౌనంగా ఉండడం, సమాచారం ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.