హైదరాబాద్ లోని నాంపల్లిలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ (నుమాయిష్ )లో ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు షీ టీమ్స్ పోలీసులు. ఇప్పటివరకు 41 మందిపై కేసులు నమోదు చేశారు. మహిళలు, అమ్మాయిలను తాకుతూ వేధించేందుకే నుమాయిసష్ కు వచ్చామనేలా కొందరు పోకిరీలు వ్యవహరిస్తున్నారు.
అటువంటి వారిని పట్టుకునేందుకు షీ టీమ్స్ పోలీసులు సందర్శకుల్లో కలిసిపోయి నిఘా పెట్టారు. నుమాయిష్ లో అనుచితంగా ప్రవర్తిస్తూ తిరుగుతున్న వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 41 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారంటే పోలీసులు పోకిరీలపై ఎంతగా నిఘా పెట్టారో అర్థం చేసుకోవచ్చు.
నిందితులకు కోర్టు మూడు రోజుల నుంచి 10 రోజుల వరకు శిక్ష విధించింది. కాగా, జనవరి 1 నుంచి ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరుగుతుంది. ఈ అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ కు ఇప్పటికే లక్షలాది మంది వచ్చారు.
నుమాయిష్ లో దాదాపు 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. సందర్శకులు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ సందర్శించుకోవచ్చు.