దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఆరేండ్లుగా ఆమె పోలీసు కస్టడీలోనే ఉందని, ఇది అత్యంత ఎక్కువ సమయం అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.
విచారణకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. షీనాబోరా హత్య 2012లో జరిగింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి ప్రధాని నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2015 నుంచి ఆమె ముంబై జైలులో ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సెరిబ్రల్ డిసీజ్‌తో ఇంద్రాణి బాధపడుతున్నారని, మరో పదేండ్ల పాటు విచారణ కొనసాగుతుందని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించింది.
ఇప్పటికే చాలా కాలం జైలు జీవితం గడిపినందున బెయిల్ పొందేందుకు ఆమె అర్హురాలంటూ సుప్రీం కోర్టు అంగీకరించింది. బెయిల్ పై బయటకు వెళ్లాక దేశం విడిచివెళ్లకూడదని, సాక్షులను ఇబ్బందులకు గురిచేయకూడదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇంద్రాణి తన మొదటి భర్త నుంచి విడిపోయాక తన కూతురు షీనా, కుమారుడు మైఖెల్‌ను గువహతిలో తన తల్లిదండ్రుల వద్ద ఉంచింది. ఆ తర్వాత సంజయ్ ఖన్నా అనే వ్యక్తిని పెండ్లి చేసుకుని అతని నుంచి విడిపోయి ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాని వివాహం చేసుకున్నది.
ఆ తర్వాత తల్లి గురించి తెలుసుకున్న షీనా ఇంద్రాణిని కలిసింది. అయితే షీనాను ఆమె తన చెల్లెలిగా అందరికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడికి, షీనాకు మధ్య ప్రేమ చిగురించింది.
ఆ క్రమంలో షీనా, ఇంద్రాణీల మధ్య ఆర్థిక విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఇంద్రాణీని షీనా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో షీనాను ఇంద్రాణీ తన రెండో భర్త భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సహాయంతో గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.