నటీనటులు: రాజశేఖర్, ప్రకాష్ రాజ్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవివర్మ తదితరులు
నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని
ఆర్ట్: సంపత్
రైటర్: లక్ష్మీ భూపాల
సెన్సార్: U/A
రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు
రిలీజ్ డేట్: మే 20, 2022
రేటింగ్: 2.5/5
ఓ భాషలో హిట్టయిన సినిమాను రీమేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఒరిజినల్ సినిమాను మహాప్రసాదం అనుకోకూడదు. తెలుగు సెన్సిబిలిటీస్, ఇక్కడి ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేయడంలో తప్పు లేదు. ఏమాత్రం మార్చినా, రిజల్ట్ మారిపోతుందనే భయం ఉన్నప్పుడు రీమేక్ ను సెలక్ట్ చేసుకోకుండా ఉండడమే బెటర్. ఈ విషయంలో శేఖర్ మేకర్స్ తప్పు చేసినట్టు కనిపిస్తోంది. ఉన్నది ఉన్నట్టు తీసి అంతా కలిసి మూకుమ్మడిగా చేతులు కాల్చుకున్నట్టు అయింది.
మలయాళంలో సూపర్ హిట్టయింది జోసెఫ్ సినిమా. జోజు జార్జ్ అక్కడ మెస్మరైజ్ చేసి పడేశాడు. ఆ కథను అతడి కోణంలోనే చెప్పారు. ఆ క్రమంలో డ్రామా ఎక్కువగా రాసుకున్నారు. మలయాళంలో హిట్టయిన ఆ ఎత్తుగడ, తెలుగులో కూడా హిట్టవుతుందని మేకర్స్ ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. ఓ థ్రిల్లర్ సినిమాను ఎంత ఎగ్జయిటింగ్ గా చెబితే అంత బాగుంటుంది. అంతే తప్ప, మలయాళంలో ఇలానే ఉంది, ఇలానే రీమేక్ చేద్దాం అనుకుంటే బోర్ కొడుతుంది. శేఖర్ విషయంలో అదే జరిగింది.
ఈ సినిమాలో థ్రిల్ కంటే డ్రామా ఎక్కువైంది. సస్పెన్స్ కంటే సెంటిమెంట్ ఎక్కువైంది. ఫలితంగా సినిమాలో మలుపుల కంటే సాగతీత ఎక్కువ కనిపించింది. అదే మంచి రైటర్ ను, డైరక్షన్ టీమ్ ను పెట్టుకొని తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టు థ్రిల్లర్ గా మార్చి ఉంటే రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పోలీసాఫీసర్ గా నెరసిన గడ్డంతో రాజశేఖర్ ఎంటర్ అవుతాడు. ఇక అక్కడ్నుంచి అతడి ప్రస్థానాన్ని చూపిస్తారు. భార్య, పిల్లలు, ప్రేయసి… వాళ్లను పోగొట్టుకున్న విధానం. ఆ కేసును శేఖర్ ఎలా డీల్ చేశాడు లాంటి అంశాల్ని వరుసపెట్టి చూపిస్తారు. జోజు జార్జి డ్రామా అక్కడ వర్కవుటుంది. అదే డ్రామా రీమేక్ లో నీరసం తెప్పింది. దర్శకురాలు జీవిత రాజశేఖర్ ఈ రీమేక్ లో మార్చింది ఏదైనా ఉందంటే, అది తండ్రికూతురు ఎపిసోడ్ మాత్రమే. దీంతో పాటు మరికొన్ని చిన్నచిన్న మార్పులు మాత్రమే ఆమె చేశారు.
థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలో తెలుగు ప్రేక్షకులకు ఓ అభిప్రాయం ఉంది. దృశ్యం, దృశ్యం-2, క్షణం లాంటి థ్రిల్లర్స్ చూసి ఉన్నారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో పరభాషా థ్రిల్లర్స్ కూడా చూసిన ప్రేక్షకులు చాలా ఉంది. ఇలాంటి వాళ్లను థియేటర్లకు రప్పించాలంటే మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది. 2018 నాటి కథనే 2022లో కూడా చూపిస్తే కనెక్ట్ అవ్వదు. ఇక కథలో క్రైమ్ ట్రాక్ లో సస్పెన్స్ 30 నిమిషాల ముందే రివీల్ అయిపోతుంది. దీంతో క్లైమాక్స్ మాత్రం అంతా ఊహించినట్టే జరుగుతుంది. అయితే ఈ క్లయిమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.
ఉన్నంతలో రాజశేఖర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అతడి లుక్, యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, శివానీ, ముస్కాన్, రాజశేఖర్ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా తమ పాత్రల మేరకు బాగానే నటించారు. టెక్నికల్ గా సినిమాలో గొప్పగా చెప్పుకోడానికేం లేదు. దర్శకురాలు జీవిత రాజశేఖర్ ఉన్నది ఉన్నట్టుగా తీశారంతే. ఆమె దర్శకత్వ ప్రతిభ కొన్ని ఎమోషన్ సీన్స్ లో కనిపించినప్పటికీ.. స్క్రీన్ ప్లేపై బాగా వర్కవుట్ చేసి ఉంటే బాగుండేది.
ఓవరాల్ గా శేఖర్ సినిమాను రాజశేఖర్ కోసం ఓసారి చూడొచ్చు. నెమ్మెదిగా సాగే నెరేషన్ తో ఈ సినిమాను చివరి వరకు చూడాలంటే చాలా ఓపిక కావాలి.