మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి తనకు విప్ పదవి వద్దని తెగేసి చెప్పేశారు. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి రాకపోవడంతో గాంధీలాగే చాలా మంది కీలక నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కచ్చితంగా తమకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన నేతల ఆశలన్నీఆవిరయ్యాయి. దీంతో అసంతృప్తి ఉన్న నేతలను బుజ్జగించే పనిలో అధిష్టానం నిమగ్నమైంది. పార్టీకి విధేయులుగా ఉంటామని టీఆర్ఎస్ నేతలు బాజిరెడ్డి, రాజయ్య, జూపల్లి కృష్ణారావు చెప్పినట్టుగా అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికీ మైనంపల్లి హన్మంతరావు, జోగు రామన్న అందుబాటులోకి రాలేదు.