కిట్టీ పార్టీల పేరుతో బడాబాబులకు టోకరా పెట్టిన శిల్పా చౌదరిని రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పరిచారు నార్సింగ్ పోలీసులు. రెండు రోజుల కస్టడీ తర్వాత కోర్టుకు తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే మరో నాలుగు రోజుల పాటు శిల్పా కస్టడీ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ఒక్కరోజు కస్టడీకి మాత్రమే అనుమతించింది.
కోర్టు ఉత్తర్వులతో మంగళవారం ఉదయం 10 గంటలకు శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. తిరిగి 15న 11 గంటలకు ఆమెను హాజరుపరుస్తారు. అటు శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది న్యాయస్థానం.
Advertisements
రూ.7 కోట్ల వరకు మోసం చేసినట్లు శిల్పా చౌదరిపై కేసులు నమోదయ్యాయి. కస్టడీలో పలు వివరాలు సేకరించిన పోలీసులు… వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. అందుకే మరోసారి విచారించేందుకు కోర్టును కోరారు. మంగళవారం ఒకరోజు పాటు ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నారు.