మహారాష్ట్రలో ఉల్లి రైతులు కదం తొక్కుతున్నారు. ఈ నెల 12 న నాసిక్ జిల్లాలోని దిండోరి టౌన్ నుంచి బయల్దేరిన వీరి మహా పాదయాత్ర వరకు దాదాపు 200 కి.మీ. దూరం లోని ముంబై వరకు సాగుతోంది, క్వింటాలుకు 600 రూపాయల ఆర్ధిక సాయాన్ని వెంటనే ప్రకటించాలని, 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఉల్లి రైతులు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఎర్రని జెండాలను, బ్యానర్లను పట్టుకుని వీరు చేస్తున్న ఈ యాత్రకు సీపీఎం అండగా నిలిచింది. క్వింటాలుకు తమ ప్రభుత్వం 300 రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తుందని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రెండు రోజుల క్రితం చేసిన ప్రకటన తమకు ఆమోదయోగ్యం కాదని ఉల్లి రైతులు అంటున్నారు. ఈ యాత్రలో రైతులు, రైతు కూలీలు, గిరిజనులు వందల సంఖ్యలో పాల్గొంటున్నారు. వీరి ప్రతినిధి బృందంతో షిండే ప్రభుత్వం మరో దఫా చర్చలు జరుపుతుందని మాజీ ఎమ్మెల్యే జీవా గవిత్ లాంగ్ తెలిపారు.
షిండేతో బాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతామని ఈ మార్చ్ కి నేతృత్వం వహిస్తున్న ఆయన వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ పాదయాత్ర థానే జిల్లాలోకి ప్రవేశించినప్పుడు మంత్రులు దాదా భూసే, అతుల్ సవే ఈ ప్రతినిధి బృందాన్ని కలిశారు. వీరి డిమాండ్లలో 40 శాతం కోర్కెల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని గవిత్ చెప్పారు.
మోడీకి ఉల్లిగడ్డల పార్సెల్ పంపిన రైతులు
మహారాష్ట్రకు చెందిన ఉల్లి రైతులు ఇటీవల ప్రధాని మోడీకి ఉల్లిగడ్డలను పార్సెల్ గా పంపారు. దేశ వ్యాప్తంగా వీటి ధరలు దారుణంగా పడిపోవడంతో వీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటి ఎగుమతులపై నిషేధం ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఏమైనా.. తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఉల్లి రైతులు వాపోతున్నారు. ఫిబ్రవరి 4 వరకు దేశంలో కొన్ని చోట్ల ఉల్లి క్వింటాలు ధర 1151 రూపాయలుండగా ఆ నెల 26-27 నాటికి ఇది 550 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం 700 రూపాయలుంది.