కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పాటు మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో షిర్డీ సాయిబాబా ఆలయ అధికారులు దర్శన సమయాల్లో కీలక మార్పులు చేశారు. ఇకపై ఉదయం 7.15 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం ఆలయం తెరిచి ఉంటుందని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.
మాములు రోజుల్లో అయితే సాయిబాబా ఆలయం ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. కానీ నైట్ కర్ఫ్యూ, పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా మార్పులు చేయాల్సి వచ్చిందని ట్రస్ట్ అధికారులు తెలిపారు. ఇక భక్తుల కోసం ఉచిత ఆహారం అందించే శ్రీ సాయి ప్రసాదాలయ ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.
ఇక ప్రతీ రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగే మొదటి హరతీ అయిన కాకాడ్ హరతీ, రాత్రి 10.30 గంటలకు జరిగే చివరి హరతీ ఏకాంతంగా జరుగుతాయని ట్రస్ట్ తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ట్రస్ట్ తో పాటు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.