మహరాష్ట్ర రాజకీయం ఇప్పుడు హస్తినకు చేరింది. 50-50 ఫార్మూలాకు శివసేన భీష్మించుకొని కూర్చోవటంతో… ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ ఒకవైపు, కూటమిగా అయినా బీజేపీని నిలువరించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ మరోవైపు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో మహరాజకీయం ఢిల్లీలో వేడి పుట్టిస్తుంది.
శివసేన లేకపోతే… సొంతగా అధికారం చేపట్టలేని సంకట పరిస్థితుల్లో ఉన్న మహారాష్ట్ర బీజేపీ… అధికారం కోసం అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సీఎం ఫడ్నవీస్ అమిత్ షాతో భేటీ కాబోతుండగా, ఢిల్లీలోనే ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అవుతున్నారు. దీంతో ఈ ఒకట్రెండు రోజుల్లో మహ నాటకానికి తెరపడే అవకాశం కనపడుతోంది.
శివసేన ఎదురుతిరిగితే… ఎన్సీపీతో జతకట్టేందుకు సీఎం ఫడ్నవీస్ ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే శరద్ పవార్ కూతురు సుప్రియా సులే అమిత్‌షాతో చర్చలు జరిపారన్న వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు శరదపవార్ మాత్రం శివసేన తమతో కలిసి వస్తే… కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నా, ఎన్సీపీ నేతల్లో ఏకాభిప్రాయం లేదన్న ప్రచారం సాగుతోంది. సోనియా-పవార్ తాజా చర్చల్లో దీనిపై ఓ క్లారిటీ వస్తే… మహరాష్ట్రలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేసే అవకాశం స్పష్టంగా కనపడుతుండగా, శివసేన వారసుడు మహరాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు.
అయితే, దీన్ని బీజేపీ ఎంతవరకు నిలువరిస్తుంది, చివరి వరకు చూసి… 50-50 ఫార్మూలాకు ఒకే చెప్తుందా అన్న సందిగ్ధత రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.