మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల కూటమి మహా వికాస్ అగాడీ ప్రభుత్వం మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా అంటే అవుననే అనిపిస్తుంది. శివసేన నేత అబ్దుల్ సత్తార్ తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేశారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన సత్తార్…తనకు ప్రాధాన్యత గల శాఖ కేటాయించలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరకు ఇచ్చిన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా లేఖను పార్టీ ఆమోదించలేదని తెలుస్తోంది. తమకు ఎలాంటి రాజీనామా పత్రాలు అందలేదని పార్టీ సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తెలిపారు. ఈ విషయం గురించి అబ్దుల్ సత్తార్ తో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడతారని మరో సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. మంత్రివర్గ విస్తరణలో తమకు పదవులు దక్కలేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని…అయితే ఇది మహా వికాస్ అగాడీ ప్రభుత్వమని…శివసేన ప్రభుత్వం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సంజయ్ రౌతు తెలిపారు. అబ్దుల్ సత్తార్ బయటి నుంచి వచ్చినప్పటికీ కేబినెట్ లో అవకాశం కల్పించారని చెప్పారు.
మంత్రి వర్గ విస్తరణతో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అసంతృప్తికి గురై విషయాన్ని అధిష్టానం దాకా తీసుకెళ్లారు. అక్కడ వారు ఏం సర్ది చెప్పారో ఏమో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో అసమ్మతి సద్దుమణిగింది.
ఎన్సీపీకి చెందిన బీడ్ జిల్లా ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తనకు రాజకీయం చేయడం చేతకాదని..అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు…అప్పుడే అసంతృప్తులు ఈ విధంగా ఉంటే ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.