నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రజలను ఉసిగొలిపి అమరవీరుల త్యాగాల మీద కుర్చీ ఎక్కి రాష్ట్రాన్నిపాలిస్తున్నారని మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి చేతకాని ముఖ్యమంత్రి..నిరుద్యోగ భృతి పేరుతో కప్పి పుచ్చారని విమర్శించారు. మూడేళ్లయినా దానికి దిక్కు లేదన్నారు. నిరుద్యోగు యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే..పార్టీలతో పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.
నోటిఫికేషన్ లు లేక ముత్యాల సాగర్ అనే నిరుద్యోగి చనిపోవడం బాధాకరమన్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం అని హెచ్చరించారు. కేసీఆర్.. నీ కళ్లకు నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా అని నిలదీశారు. 2018 బిస్వాల్ కమిటీ ద్వారా లక్షా 91 వేల ఉద్యోగాలు ఉన్నాయని తెలిసిందన్నారు.
తెలంగాణలో ఉద్యోగాల కోసం 50 లక్షల మంది ఎదురు చూస్తున్నారనే విషయం నీకు తెల్వదా అని సీఎంను ప్రశ్నించారు. టీఎస్పీస్సీ ద్వారా 26 లక్షల అప్లికేషన్లు ఉన్నాయన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ 3000 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
Advertisements
రాష్ట్రంలో ఉన్న ప్రతీ నిరుద్యోగి నెత్తిన ప్రభుత్వం లక్ష రూపాయల అప్పు మోపిందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇక్కడ కొట్లాట ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల మిలియన్ మార్చ్ చేస్తానంటున్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు శివసేనా రెడ్డి.