మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణం సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్రం ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. గతంలో పార్టీ చేసిన సవరణను ఎన్నికల సంఘం తప్పు పట్టింది. పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణను అప్రజాస్వామికంగా ఎన్నికల సంఘం పేర్కొంది.
పార్టీలో ఎలాంటి ఎన్నికలూ నిర్వహించకుండా సొంత కోటరీలోని వ్యక్తులను పార్టీ పదాధీకారులుగా నియమించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పట్టింది. ఈ మేరకు అప్రజాస్వామికంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నారని స్పష్టం చేసింది. అలాంటి పార్టీ వ్యవస్థలను నమ్మలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.
1999లో ఎన్నికల సంఘం ఒత్తిడి మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు చేర్చారు. కానీ ఆ తర్వాత వాటిని తొలగించారని పేర్కొంది. 2018లో పార్టీ నేతలు మోసపూరితంగా పార్టీ రాజ్యాంగాన్ని సవరించారని ఈసీ వివరించింది. ఆ తర్వాత కొత్త రాజ్యాంగాన్ని కూడా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ తమకు సమర్పించలేదని వెల్లడించింది.
ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఏక్నాథ్ శిండే వర్గానికే చెందుతాయని ఈసీ తేల్చిచెప్పింది. 2019లో మహారాష్ట్ర ఎన్నికల్లో 55 మంది శివసేన పార్టీ తరఫున గెలిచారు. వీరిలో సుమారు 40 మంది శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇచ్చారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది.