శివసేనలో రేగిన చిచ్చు తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఠాక్రే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. పార్టీలోని అధిక శాతం నేతలు ముర్మువైపే నిలబడ్డారు అనేక మీటింగులు, చర్చలు జరగ్గా అదే విషయాన్ని అధినేతకు చెప్పారు. ఉన్న కొద్ది మందికి వ్యతిరేకంగా వెళ్లడం ఎందుకులే అని అనుకున్నారో ఏమోగాని.. ముర్ముకే జై కొట్టారు ఠాక్రే.
ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని శివసేన నిర్ణయించినట్లు అధికారికంగా ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని.. పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలోనూ వారెలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టంచేశారు.
తమది సంకుచిత మనస్తత్వం కాదన్న ఠాక్రే.. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతుండటం పట్ల తమకు సంతోషంగా ఉందని తెలిపారు. 14 మంది ఎంపీలు మంగళవారం నాటి కీలక భేటీకి హాజరు కాగా వారిలో మెజారిటీ ఎంపీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. సంజయ్ రౌత్ మాత్రం యశ్వంత్ సిన్హా వైపు మొగ్గుచూపారని సమాచారం.
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థులు ముర్ము, సిన్హా ప్రచారంలో భాగంగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.