తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన తొలి తెలుగు సినిమా ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పించారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, అంతే భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈసారి అనుదీప్ మేజిక్ పనిచేయలేదు. అతడి కామెడీ పండలేదు. కేవలం 2-3 చోట్లు మాత్రమే కామెడీ పండింది. మిగతాదంతా నీరసంగా మారింది. ఫలితంగా ప్రిన్స్ సినిమా బాక్సాఫీస్ బరిలో బోల్తాకొట్టింది.
ఈ సినిమాతో నిర్మాతలు (బయ్యర్లు కూడా వీళ్లే) భారీగా నష్టపోయారు. ఈ నష్టాల్ని కొంతలో కొంత భర్తీ చేసేందుకు ముందుకొచ్చాడు శివ కార్తికేయన్. తను తీసుకున్న రెమ్యూనరేషన్ లో సగాన్ని వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విలువ 6 కోట్ల రూపాయలు అని టాక్.
మొత్తమ్మీద శివకార్తికేయన్ కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మొహం చాటేయకుండా, ఇలా డబ్బులు వెనక్కి ఇచ్చి తను అందరివాడ్ని అని నిరూపించుకున్నాడు. ఈ సంగతి పక్కనపెడితే.. ప్రిన్స్ దెబ్బతో అనుదీప్ కెరీర్ వెనక్కి వెళ్లిపోయింది. అతడు తన నెక్ట్స్ సినిమా కోసం మరింత కష్టపడుతున్నాడు.