మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వ్యక్తిని ఓ మహిళ దూషిస్తూ అతనిపై ఇంక్ పోసింది. ఇంక్ పోసిన ఆ మహిళను శివసేన కార్యకర్తగా అనుమానిస్తున్నారు. ఆరేంజ్-గ్రీన్ కలర్ చీర కట్టుకున్న ఆమె ఫోన్ లో మాట్లాడతున్న వ్యక్తిని దూషిస్తూ ఇంక్ చల్లింది. రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఇంత జరుగుతున్నా ఆ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ఆ మహిళను అడ్డుకోవడానికీ ప్రయత్నించలేదు. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వార్తా సంస్థ ప్రసారం చేసింది.
వారం రోజుల్లోనే శివసేన కార్యకర్తలు ఈ విధంగా చేయడం ఇది రెండోసారి. గత వారం ముంబైకి చెందిన హీరామై తివారీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు 25-30 మంది శివసేన కార్యకర్తలు అతడిని చితకబాది గుండు గీయించారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్ధులపై పోలీసుల అణిచివేతను ఉద్ధవ్ ఠాక్రే ”జలియన్ వాలా బాగ్” దుర్ఘటనతో పోల్చడాన్ని హీరామై సోషల్ మీడియాలో తప్పుబట్టాడు. తనకు గుండు గీయించిన వారిపై హీరామై తివారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.