రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్, అందాల పోటీల్లో పాల్గొంటోంది. ఈ విషయాన్ని స్వయంగా తనే బయటపెట్టింది. మిస్ ఇండియా 2022 ఆడిషన్స్ లో ఆమె పాల్గొంటోంది. ఆంధ్రప్రదేశ్ ను రిప్రజెంట్ చేస్తూ, ముంబయిలో జరిగే ఫైనల్ ఆడిషన్స్ కు బయల్దేరింది శివానీ.
ఆడిషన్స్ లో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోటీలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందిని సెలక్ట్ చేశారు. ఈ 8 మందిలో శివానీ రాజశేఖర్ ఒకరు. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన ప్రాబబుల్స్ తో ముంబయిలో ఫైనల్ ఆడిషన్స్ ను ఈరోజు మొదలుపెట్టారు.
18, 19, 20 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ ఫైనల్ ఆడిషన్స్ లో దేశవ్యాప్తంగా 31 మందిని ఎంపిక చేస్తారు. ఈ 31 మందిలో శివానీకి చోటు దక్కుతుందా, దక్కగా అనేది 20వ తేదీన తేలుకుంది. ఒకవేళ ఈ 31 మందిలో శివానీకి చోటు తగ్గితే, ఆ తర్వాత జరిగే తుది మిస్ ఇండియా పోటీలకు ఆమె ఎంపికవుతుంది.
మిస్ ఇండియా కిరీటాన్ని గెలవడం అనేది ఓ డ్రీమ్. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఎంతో కృషి, పట్టుదల అవసరం. దీని కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతోంది శివానీ. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు అందాల పోటీలకు సన్నద్ధమౌతోంది. చాలామంది ముద్దుగుమ్మలు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత సినిమాల్లోకి వస్తే, శివానీ మాత్రం సినిమాలు చేసిన తర్వాత మిస్ ఇండియా పోటీలకు వెళ్తోంది.