భృగు మహర్షి తపస్సు చేసి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించిన క్షేత్రం బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. 6వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ గుట్టపై వెలసిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అర్చనలు జరుగుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొంటారు అని ఆలయ అర్చకులు కార్యనిర్వాహక అధికారి తెలిపారు.
శివరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలిపారు. ఉదయం నుండి ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు రేపు ఎల్లుండి కొనసాగుతాయి. శివరాత్రి సందర్భంగా ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు దర్శనానికి వీలుగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల కోసం, మంచినీరు, మజ్జిగను కూడా అందించనున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. భజనలు సంకీర్తనలతో ఆలయం పరిసరాలు శివనామస్మరణతో మారు మ్రోగనున్నాయి.