'మహా' రాజకీయంలో ఊహించని మలుపు - Tolivelugu

 ‘మహా’ రాజకీయంలో ఊహించని మలుపు

మహరాష్ట్ర రాజకీయాలు ఊహించని ములుపు తీసుకుంటున్నాయి. బీజేపీ-శివసేన దోస్తానాకు బీజేపీ ముగింపు పలకటంతో… శివసేన సర్కార్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంఖ్యాబలంపై కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దోస్తీ కోరుతోంది.

కీలకమైన మహారాష్ట్ర పీఠంను ఎలాగైనా బీజేపీకి దూరం చేయాలని భావిస్తోన్న కాంగ్రెస్‌కు అనుకోని చాన్స్‌ లభించింది. బీజేపీ-శివసేన పంతాలకు పోయి వేరవటంతో శివసేనకు ఎన్సీపీతో దోస్తానా కుదిరించి తాను బయటి నుండి మద్దతిచ్చేందుకు సూత్రాప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. పదవుల కోసం పట్టుబట్టకుండా… శివసేన-ఎన్సీపీ సర్కార్‌ను కంట్రోల్ చేయాలన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడగా కనపడుతోంది. దేశంలోని కీలక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మహరాష్ట్రలో అధికారంలో ఉండటం అన్నివిధాలా లాభమేనని కాంగ్రెస్ భావిస్తుంది.

అయితే, శివసేనకు ముఖ్యమంత్రి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఓకే చెప్పటంతో ఎన్సీపీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి అజిత్‌ పవార్‌కు ఇవ్వాలని ఎన్సీపీ పట్టుబడుతుండగా… శివసేన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి మహరాష్ట్రలో అధికారపీఠం ఎక్కబోతున్నాయి.

ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోని… పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన మారాఠా పార్టీలు శివసేన, ఎన్సీపీలు ఇప్పుడు అధికారం కోసం చేతులు కలపటంపై బీజేపీ విమర్శల దాడి మొదలుపెట్టేందుకు రెడీ అయింది. కేంద్రంలో ఎలాగు అధికారంలో ఉన్నందున తమకు అధికారం దక్కకుండా చేసిన శివసేన, ఎన్సీపీలే టార్గెట్‌గా పనిచేయాలని మాజీ సీఎం ఫడ్నవీస్‌ కార్యాచరణ రూపోందించినట్లు బీజేపీ వర్గాలంటున్నాయి.

మొత్తానికి శివసేన తన పంతాన్ని నెగ్గించుకొని, మహరాష్ట్ర సీఎం ఖుర్చీపై తమ వారసుడు ఆదిత్య ఠాక్రేను కూర్చోపెట్టేందుకు రంగం సిద్ధమయింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp