మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. విదేశీ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించారు. హార్ట్ ఎటాక్‌తో బుధవారం రాత్రి దుబాయ్‌లో చనిపోయారు. దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు ఎమ్మెల్యే రమేశ్ లట్కే.. కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ తెలిపారు.
ముంబైలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి రమేశ్ లట్కే రెండుసార్లు శివసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్టిని ఓడించి.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లట్కే. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం. పటేల్‌పై ఘన విజయం సాధించారు. అంతకుముందు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు(బీఎంసీ) కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు.
లట్కే భౌతికకాయాన్ని, ఆయన కుటుంబసభ్యులను దుబాయ్ నుంచి భారత్ రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మరణం పట్ల శివసేన,బీజేపీ సహా పలు పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
బీజేపీ నేత నితేష్ రానే లట్కే మృతిపై స్పందిస్తూ.. ‘శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యా. కొన్ని నెలల క్రితం అంగ్నేవాడి జాతర కోసం కోకన్‌కి విమానంలో వెళ్తున్నప్పుడు ఆయనను కలిసిన విషయం నాకు గుర్తుంది. డైటింగ్ వల్ల చాలా బరువు తగ్గాడని నేను అతనిని మెచ్చుకున్నాను. అతను పార్టీకి అతీతంగా స్నేహితుడు’ అని ట్వీట్ చేశారు.