జీవిత – రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివాత్మిక, తనని తాను నిరూపించుకునే దిశగా ముందుకు వెళుతోంది. ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన శివాత్మిక, ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల వచ్చిన ‘రంగమార్తాండ’లో శివాత్మిక చేసిన పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో శివాత్మిక మాట్లాడుతూ .. ‘రంగమార్తాండ’లో చేసే ఛాన్స్ రావడం నేను చేసుకున్న అదృష్టం. ఒక వైపున కృష్ణవంశీ గారు .. మరో వైపున సీనియర్ స్టార్స్ కావడంతో కొంత భయపడ్డాను. కానీ వాళ్లందరి సపోర్టుతో బాగా చేయగలిగాను. ఈ సినిమా చూసిన చాలామంది నన్ను గుర్తుపెట్టుకుని మెచ్చుకుంటూ ఉండటం విశేషం” అంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది.
‘రంగమార్తాండలో నాది మెయిన్ లీడ్ కాదు. ఇది కమర్షియల్ సినిమా కూడా కాదు. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు చాలా మంది ఆ సినిమా చెయ్యొద్దు అన్నారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యకు అన్నారు. ఇప్పుడు అలాంటి సినిమా ఎవరూ చూడరు అని అన్నారు. చాలా భయపెట్టారు. కానీ ఏమైంది ఆ సినిమా మంచి హిట్ అయి పేరు తీసుకువచ్చింది.
‘దొరసాని’ సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నాను. ఈ సినిమా చేసిన తరువాత ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నాను. కానీ ఆ తరువాత గ్యాప్ రావడంతో, నేను అనుకున్నంత ఈజీ కాదు అనే విషయం అప్పుడు అర్థమైంది. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ పోవడమే మన చేతుల్లో ఉందనే సంగతి స్పష్టమైంది” అంటూ చెప్పుకొచ్చింది.