మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. సోమవారం సాయంత్రం శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలందరూ ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో గుమికూడి తమ బలాన్ని ప్రదర్శించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిజ్న చేశారు. ‘‘ నేను బీజేపీకి ఏ రకంగా సహాయపడను…ఎలాంటి తాయిలాలకు ఆశపడను..నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడను …నా పార్టీకి వెన్నుపోటు పొడవను ’’ అంటూ ఆయా పార్టీల ఎమ్మెల్యేలంతా చేయి చాచి ప్రమాణం చేశారు. తాము మొత్తం 162 మందిమి ఉన్నామంటూ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో భారత రాజ్యాంగం బ్యాక్ గ్రౌండ్ లో దిగిన ఫోటోను విడుదల చేశారు. కావాలంటే వచ్చి చెక్ చేసుకోవచ్చన్నారు. హోటల్ లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే లు ఉన్నారు. వారితో పాటు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలె, ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రేలు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ, విక్టరీ సింబల్స్ చూపిస్తూ గడిపారు. తాము మొత్తం 162 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ స్వయంగా వచ్చి చూసుకోవచ్చన్నారు శివసేన నేత సంజయ్ రౌతు.