శివసేన పార్టీ ఎన్నికల గుర్తు వివాద అంశంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇటీవల సీఎం ఏక్ నాథ్ షిండే శిబిరానికి శివసేన ఎన్నికల గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే. శివసేన ఎన్నికల గుర్తును ఈసీ కేటాయించిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంను ఆశ్రయించింది.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ విచారణను స్వీకరించింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం కోర్టును కోరింది.
ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునే వరకు యధాస్థితిని కొనసాగించాలని ఉద్ధవ్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. తమకు రక్షణ కావాలని, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేదన్నారు. శివసేన పార్లమెంటరీ కార్యాలయాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.