రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అనగానే మనకి మదిలో మెదిలే వ్యక్తి షోయబ్ అక్తర్. ఈ పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ తన బౌలింగ్ తో ఎంతోమంది ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. ఎందుకంటే అతడి బౌలింగ్ లో ఎంతోమంది ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు అనేకం. అయితే.. అక్తర్ ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
‘‘తాను ఏ బ్యాటర్ ను అయినా ఔట్ చేయడానికంటే ముందు గాయపరచడానికి చూసేవాడిని. అలా చాలా మందిని గాయపరిచాను. కానీ తాను ఓ బ్యాటర్ విషయంలో మాత్రం గాయపరిచే విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాను’’ అని చెప్పాడు.
ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అవునండి మన సచిన్ ను గాయపరిచే విషయంలో మాత్రం తన కోరిక తీరలేదని అక్తర్ పేర్కొన్నాడు. అసలు విషయం ఏంటంటే 2006లో టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు అక్తర్.
‘‘కరాచీలో మూడో టెస్టు జరిగిన సమయంలో సచిన్ ను గాయపరచడమే లక్ష్యంగా బౌలింగ్ చేయడం మొదలు పెట్టేశాను. ఇది గమనించిన కెప్టెన్ ఇంజమామ్ మాత్రం అతడిని ఔట్ చేయమని సలహా ఇచ్చాడు. కానీ.. నేను దానిని ఏ మాత్రం పట్టించుకోలేదు. సచిన్ ను గాయపరచడమే నా ముందున్న ఏకైక లక్ష్యం. అలాగే దూకుడుగా బౌలింగ్ చేసేశా.. కానీ ఆ బాల్ సచిన్ హెల్మెట్ ను బలంగా తాకింది. ఇక సచిన్ పని అయిపోయిందని అనుకున్నా. కానీ అతడు తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు’’ అని అన్నాడు అక్తర్. మళ్లీ అతడిని దెబ్బ తీద్దామనుకున్నా ఇప్పటికీ.. ఎప్పటికీ తీరని కోరికగానే అది ఉండిపోయిందని వివరించాడు.