మందుబాబుల న్యూ ఇయర్ జోష్ ని అంతా ఒక్కసారిగా దించేశారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు షాక్ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజే కాదు.. ఎప్పుడైనా డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కితే కేసులు, జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు అవుతుంది.
మద్యం మత్తులో మందుబాబులు ప్రమాదాలకు కారణం అవుతుండడంతో రవాణా శాఖ ఈ విషయంపై దృష్టి సారించింది. ట్రాఫిక్ పోలీసుల నివేదికల ఆధారంగా ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులపై రవాణా శాఖ అధికారులు వేగంగా స్పందిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేస్తున్నారు. గతేడాది 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు 5819 డ్రైవింగ్ లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీఏ పరిధిలో 5819 డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేసినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు.ఇక 2021 ఏడాదితో పోల్చితే ఇది 3,220 అధికమని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ పరిధిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్ లు ఉండగా ఈస్ట్ జోన్ మినహా మిగతా అన్ని జోన్లలో భారీగా లైసెన్స్ లను రద్దు చేశారు. నార్త్ జోన్ లో 1103, సౌత్ జోన్ లో 1151, ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1345 డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేయడం జరిగింది. అయితే మద్యం మత్తులో వాహనదారులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేయాలని ట్రాఫిక్ పోలీసులు మూడు,నాలుగేళ్లుగా ప్రత్యేక కోర్టులను అభ్యర్థిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులు సూసైడ్ బాంబర్ల కంటే ప్రమాదం.. వారి లైసెన్స్ లు రద్దు చేయాలంటూ ఢిల్లీ కోర్టు కొన్నేళ్ల క్రితం వ్యాఖ్యానించడంతో పాటు మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేయాలని సూచించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కోర్టులు డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేస్తున్నాయి.