ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రిబుల్ ఆర్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని ఎప్పుడు చూసేద్దామా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. దానికి కారణంగా స్టార్టింగ్ నుంచి ఈ సినిమాపై మేకర్స్ చేసిన ప్రమోషన్ అలాంటిది.
ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఆర్ఆర్ఆర్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇంకొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది ట్రిబుల్ ఆర్. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతోంది. అయితే.. విడుదలకు ఇంకొద్ది గంటలు ఉండగా.. అభిమానులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లో కేవలం 5 థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతినిచ్చింది.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకు 5 షోస్ ప్రదర్శించుకునేలా ఓకే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో సినీ ప్రేమికుల్లో కాస్త నిరాశ నెలకొంది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్, మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షోను ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం.
ఈ థియేటర్లలో నిబంధనలకు అనుగుణంగా సినిమా ప్రదర్శించడం జరుగుతుందా అనే విషయాన్ని సైబరాబాద్ పోలీసులు చూసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ మూవీ టికెట్స్ రేట్లు వెయ్యి, 2 వేలు కూడా పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల టికెట్ల దందా నడుస్తోంది. గత సినిమాలపై ఎన్నో కండిషన్స్ పెట్టిన జగన్ సర్కార్.. ఆర్ఆర్ఆర్ సమయంలో సామాన్యుడి జేబు ఖాళీ అవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.