జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం కన్ను మూశారు. దుండగుడి కాల్పుల్లో గాయపడిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అబే మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఓ మహోన్నత నేతను కోల్పోయిందని మోడీ అన్నారు.
ఈ విషాదాన్ని మాటల్లో వివరించలేమంటూ ఆయన ట్వీట్ చేశారు. షింజో అబే మృతికి నివాళిగా రేపు సంతాప దినంగా ప్రకటిస్తున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘ నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు అబే మరణించడం నన్ను తీవ్రమైన షాక్ కు గురిచేసింది. ఆయన ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. అంతకు మించి అద్భుతమైన పాలకుడు. జపాన్ సహా ప్రపంచం మొత్తాన్ని గొప్పగా మార్చేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు’ అని ట్వీట్ చేశారు.
‘మా ఇద్దరి మధ్య స్నేహం ఏండ్ల నాటిది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే షింజే గురించి ఎన్నో గొప్ప విషయాలను విన్నాను. నేను ప్రధానిగా పదవి చేపట్టాక మా బంధం మరింత బలపడింది. ఆయనకు ఆర్థిక, ప్రపంచ వ్యవహారాలపై ఎంతో గొప్ప అవగాహన ఉంది. అవి నన్ను చాలా ప్రభావితం చేశాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.