హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతుల హత్యతో తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ దారుణాలు ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి. గతంలో కూడా పలువురి హత్యకు కుంట శ్రీనివాస్ ప్లాన్ వేసినట్టుగా ఆధారాలు బయటపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కోసం కుంట శ్రీనివాస్ ఎంతకైనా తెగించేవాడని ఆ ఆడియో టేపులను వింటే అర్థమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంథని నియోజకవర్గానికే చెందిన ఓ కాంగ్రెస్ నేతను చంపేందుకు పుట్ట మధు అనుచరుడితో కుంట శ్రీనివాస్ డీల్ మాట్లాడుకోవడం ఆ ఆడియోలో స్పష్టంగా తెలుస్తోంది. 50 లక్షల రూపాయలు, రెండు ఫేక్ సిమ్ కార్డులు ఇస్తే పని పూర్తవుతుందని పుట్ట మధు అనుచురుడికి కుంట శ్రీనివాస్ చెప్పడం విస్తుపోయేలా చేస్తోంది. కుంట శ్రీనివాస్ మాటలు వింటోంటే.. అతనికి హత్యలు చేయడం అసలు కొత్త కాదన్న విషయం స్పష్టమవుతోంది. కుంట శ్రీనివాస్‌కు గతంలో సికాసలో పని చేసిన చరిత్రతో పాటు ఆయనపై అనేక భూకబ్జా, బెదిరింపులు కేసులు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అదే ఆడియోలో.. పుట్ట మధు అనుచరుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఆందోళన కలిగించేలా ఉన్నాయి. పుట్ట మధు గెలిచాకా.. ఐదేళ్లు తమదే రాజ్యం.. ఆయన కోసం రిస్క్ చేయాలని ఆ వ్యక్తి కోరడం చూస్తోంటే.. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే డైరెక్షన్‌లోనే నడిచాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.