అసలు నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు సినీ తారలతో ట్వీట్లు పెట్టించి డ్రామాలు చేస్తున్నది ఎవరు? యురేనియం వ్యతిరేక ఉద్యమం నడిపిస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆ క్రెడిట్ వేరెవరికో పోతుండటం ఇష్టం లేక పోటాపోటీగా యాక్టర్లని రంగంలోకి దింపింది ఎవరు? ముందున్నది ఎవరు? వెనుక ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నలు పలు ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. దీని వెనుక కేటీఆర్ ఎత్తుగడ ఒకటి అదృశ్యంగా వుండి కథ నడిపిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణాలో రాజకీయాలు ఇప్పుడు యురేనియం చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి సినిమా రంగులు అద్దడం కొత్త పరిణామం. ఎప్పుడైతే కాంగ్రెస్ నేత వీహెచ్ వెళ్లి జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారో అప్పుడే రాజకీయ ఎత్తులు షురూ అయ్యాయి. టీఆర్ఎస్ అనుకూలంగా కొందరు, రేవంత్, పవన్ ఉద్యమాలకు ఆకర్షితులై మరికొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఇందులో భాగస్వాములు కావడంతో ఈ యురేనియం గొడవ ఏంటో అర్ధం కాని సామాన్య జనం కూడా సడెన్‌గా ఇటు దృష్టి పెట్టారు. పాలక పక్షంలో వున్న పెద్దలకు కావాల్సింది కూడా ఇదే. ప్రజల దృష్టిని ఇటు వైపు మరల్చడం.. నల్లమల అడవుల్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ పెద్దలే ఒక ట్వీట్ చేసి యురేనియం గురించి, భావితరాలను కాపాడే బృహత్తర బాధ్యత గురించి మాట్లాడటాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఇందులో ఉన్న ఎత్తుగడ ఏంటో సులభంగానే అర్ధం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం యావత్తూ విష జ్వరాలతో ఇబ్బందులు పడుతోంది. రైతాంగం యూరియా, ఇతర సమస్యలతో అవస్థలు పడుతోంది. మరోపక్క సొంత రాజకీయ శిబిరంలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అందర్నీ ఇటునుంచి అటు మరల్చాలంటే మరో చోట ఎక్కడో చిచ్చు రగలాలి. అదిగో.. ఆ ప్రయత్నమే.. ఈ యురేనియం.. దానికి ఫిల్మీసపోర్ట్ కోటింగ్..
విజయ్ దేవరకొండ ఇప్పుడు హైదరాబాద్ వంటి ఒక మెట్రో సిటీకి యూత్ ఐకాన్. దేవరకొండ తెలంగాణ సమాజానికి అచ్చమైన ప్రతినిధిగా వుండే ఓ బంగారుకొండ. అలాంటి హీరో ఇప్పుడు యురేనియం గురించి ట్వీట్లు చేసి యూత్ ఫోకస్ అటు మళ్లించాడు. మరో కమెడియన్ రాహుల్, యాంకర్ అనసూయ కూడా ట్వీట్ల ద్వారా యురేనియం వ్యతిరేక ఉద్యమాన్ని మొదలెట్టారు. ఈ సినీ ట్వీట్లకు కొనసాగింపుగా కేటీఆర్ కూడా యురేనియంపై ప్రభుత్వం సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుందంటూ మాట్లాడ్డం.. దానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వెంటనే రియాక్టవుతూ.. ‘ఈ డ్రామాలేమిటి..’ అంటూ నిలదీయడం.. ఇవన్నీ ఒకదానికి ఒకటి ప్రభుత్వ పెద్దలు ఊహించిన పరిణామాలు.
ఇక్కడే రేవంత్ మాటల్ని ఒకసారి ప్రస్తావించాలి. ‘అసలు యురేనియం సర్వే పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన యురేనియం కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చిన మీరే వ్యతిరేక ఉద్యమం చేపట్టడం డ్రామా కాక మరేమిటి’ అని రేవంత్ మండిపడ్డారు. ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ట్వీట్లు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి యురేనియం తవ్వకాలకు నల్లమల అటవీ ప్రాంతంలో కేసీఆర్ సర్కార్ అనుమతులు ఇచ్చి ఇప్పుడు కొత్తగా సినీజనంతో ఉద్యమాలు చేయించడంలోనే రాజకీయం ఉంది. తాగునీరు విష పూరితం అవుతుందన్న ఆందోళన ఊపందుకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీని దోషిగా నిలిపి రాజకీయ లబ్ది పొందాలన్న కేసీఆర్ వ్యూహం దీనిలో ఉందని కొందరంటుంటే, లేదు.. ఈ క్రెడిట్ అంతా రేపు రేవంత్, పవన్ కల్యాణ్ జాయింట్ అకౌంటులోకి వెళ్లిపోతుందనే బెంగతోనే వారు ఫోకస్ అవ్వకుండా దేవరకొండ వంటి వారిని సీన్‌లోకి దింపారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇందులో ఏదో ఒకటి నిజం, మరేదో అవాస్తవం అయినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు, యుారియా కొరత వంటి సమస్యలు మాత్రం పక్కకు వెళ్లిపోయాయి. టీఆర్ఎస్ అసంతృప్తులు కూడా ఈ వివాదం మాటున మరుగున పడితే పాలకులకు పాలు పోసినట్టే.