గుంటూరు: మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మిస్టరీ డెత్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. కోడెల మృతికి అధికార పక్షం రాజకీయ వేధింపులే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలే కాకుండా, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆరోపిస్తుంటే, అధికార పక్షంలో వున్న నేతలు, ముఖ్యంగా కోడెలకు ప్రత్యర్ధిగా ఉన్న అంబటి రాంబాబు ఇది ఆత్మహత్య కాదు, హత్య అనే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నారు. దానికి తోడు కోడెల మేనల్లుడిగా చెబుతున్న కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని అతను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.
శివరాం తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్టు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం కానీ, అంత బాధ కానీ లేదని , శివరామే హత్య చేసివుంటాడని ఆరోపించాడు. కంచేటి సాయి వైసీపీకి చెందిన మనిషిగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీకార రాజకీయాలకు పెద్దమనిసి నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా జనం దృష్టి తమ మీదకు రాకుండా కేసులు పెట్టించి శవ రాజకీయం చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇలావుంటే అంబటి రాంబాబు ఒక పత్రికా ప్రకటన చేస్తూ.. కోడెల మరణం మీద అనేక రకాల వార్తలు వస్తున్నాయని, దీని మీద తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు కూడా నిష్పక్షపాతమైన విచారణ జరిపించి అసలు వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని అంబటి పేర్కొన్నారు. బాధ్యత గల వ్యక్తిగా కోడెల ఉమ్మడి రాష్ట్రానికి కూడా మంత్రిగా పని చేశారని అంటూ, దీని మీద తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదేతరహాలో మరో ప్రకటన చేశారు. శివప్రసాద్ మరణంపై వార్తలు క్షణక్షణం మారుతూ వస్తున్నాయని, ముందు గుండెపోటుతో మరణించారని వార్తలొచ్చాయని, మళ్ళీ వెంటనే గతరాత్రి ప్రమాదకరమైన ఇంజక్షన్ వేసుకున్నారని మరో వార్త ప్రసారం చేశారని, ఇలా ఓ సీనియర్ రాజకీయ నాయకుడి మరణంపై పలు కథనాలు వస్తున్నప్పుడు వాటిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని బొత్స అన్నారు. సమగ్ర విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ఏదైనా జరిగితే దగ్గరలో అనేక ప్రముఖ ఆసుపత్రులు వుండగా, వీటిని కాదని కోడెలను బసవ తారకం కాన్సర్ ఆసుత్రికి తీసుకువెళ్లడం పట్ల సందేహాలు వ్యక్తవుతున్నాయని బొత్స ప్రధానంగా వ్యక్తంచేస్తున్న సందేహం. తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల మరణంపై శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలావుంటే, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కోడెల మృతిపై కేసు నమోదచేసి మూడు టీమ్‌లతో దర్యాప్తు జరువుతున్నామని తెలిపారు. బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో విచారణ కొనసాగుతోందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుందని అన్నారు. క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ రంగంలోకి దిగాయని తెలిపారు.