సీఎస్ ఎల్వీసుబ్రమణ్యం ఆకస్మిక బదిలీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైఎస్ రాజశేఖర్ హయం నుండి వైఎస్ ఫ్యామిలికి అత్యంత సన్నిహితునిగా పేరున్న ఎల్వీపై వేటు వేయటం సీనీయర్ ఐఎఎస్ నేతల్లో చర్చనీయాంశం అవుతోంది.
నిబంధనలు పాటించలేదని…లేని అధికార పెత్తనం చలాయిస్తున్నారన్న కారణంతో సీఎంవో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు మెమో జారీ చేశారు సీఎస్. సీఎంకు గానీ, తనకు గానీ సమాచారం లేకుండా ఫైల్ క్యాబినెట్‌కు ఎలా పంపిస్తారన్నది ఆయన ప్రశ్న. కానీ తనకు సమాచారం లేకుండానే మెమో ఇచ్చారన్న కోపంతో… ఏకంగా సీఎస్‌నే బదిలీ చేశారు. పైగా తన బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది జీఏడీ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా చూస్తున్న ప్రవీణ్ ప్రకాశ్.
అయితే, ఈ ఉత్తర్వులు కూడా సీఎంకు తెలిసే చేశారా, క్యాబినెట్‌కు ఫైల్ పంపినట్లే చెప్పకుండా ఉత్తర్వులిప్పించారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఎన్నికల సమయంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ఆరోపణలతో… ఎన్నికల కమీషన్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్‌గా నియమించింది. సీఎంగా జగన్ పదవి చేపట్టాక కూడా ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు. పైగా సన్నిహితులు. అందుకే ఎన్నికల సమయంలో… ఎల్వీ పనితీరుపై టీడీపీ ఎన్నో ఆరోపణలు చేసింది కూడా.
అంత జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉండి, ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సీనీయర్ అధికారిని… తాను మెమో ఇచ్చిన అధికారితోనే బదిలీ ఉత్తర్వులు ఇప్పించటంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీపై మాజీ సీఎస్ కృష్ణారావు స్పందించారు. సీఎం కార్యాలయ సిబ్బంది విపరీతంగా ప్రవర్తిస్తూ, తమకు బాధ్యతలేని అంశాల్లో కూడా తలదూర్చుతున్నారని… ఇదంతా టీడీపీ హయం నుండి మొదలై, వైసీపీ సర్కార్‌లోనూ కొనసాగుతుందని మండిపడ్డారు.