తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలో కేటీఆర్ బాధ్యతలు స్వీకరించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. అందుకు దారితీసిన పరిస్థితులపై అనేకానేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఈ మార్పు అని కొందరు.. హరీష్ రావు హవాకు బ్రేక్ వేసేందుకేనని మరికొందరు.. ఇలా ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. అయితే కేటీఆర్‌ని సీఎం చేయడానికి కారణం జమిలి ఎన్నికలు కూడా ఓ కారణమని తెలుస్తోంది.
దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందని ఇప్పటికే ప్రధాని మోదీ హింట్ ఇచ్చారు. దీంతో ఏ సమయంలోనైనా ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావొచ్చని.. సందర్భం వచ్చినప్పుడల్లా అన్ని పార్టీల అధినేతలు పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమైన సందర్భంలోనూ కేటీఆర్ ఇదే విషయాన్ని వారితో ప్రస్తావించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకి పుంజుకుంటుండటం, ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత పెరుగుతుండటంతో టీఆర్ఎస్‌ని కలవరపెడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకపోవడంతో కేటీఆర్‌ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే మరో మూడున్నరేళ్లు ప్రభుత్వానికి ఏ ఢోకా లేకపోయినా.. ఉన్నపళంగా కేటీఆర్‌కి పట్టం గట్టేందుకు సిద్దమవుతున్నారన్న విశ్లేషణలు చేస్తున్నారు.