జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కథ ఏంటి..? ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ దగ్గర వున్న మంత్రం ఏంటి..? తనపై విమర్శల్ని ఎక్కుపెట్టిన స్టేట్ బీజేపీ లీడర్ల నోళ్లు మూయించే మాస్టర్ ప్లాన్ ఏంటి?
AP ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డిల్లీ టూరులో ఓ ఆసక్తికరమైన మేటర్ ఉంది. ఢిల్లీ పెద్దలను కూల్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని సమాచారం ఉంది. ప్రధానితో సమావేశం సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి జగన్ ప్రస్తావిస్తారు. విద్యుత్ పీపీఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వంటి ముఖ్యమైన అంశాలు ఎటూ ప్రస్తావనకు రానున్నాయి. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న జగన్.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.12,500 అందజేస్తుండగా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వచ్చే రూ.6 వేలను కూడా అందులో కలుపుతారు. దీంతో ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని జగన్‌ను రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
గతంలో చంద్రబాబు ఇలాగే కేంద్రం నిధులిచ్చిన పథకాలకు తన పేరు పెట్టుకున్నారని మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు విమర్శించారు. స్టిక్కర్ సీఎం అంటూ బాబును విమర్శించారు. ఇప్పుడు బీజేపీ తనపై కూడా అలాంటి విమర్శలే ఎక్కుపెట్టే అవకాశం ఉండటంతో జగన్ అప్రమత్తం అయ్యారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు.. రెండు విధాలుగా ప్రయోజనం కలిగేలా ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. దాన్ని పీఎం ముందు వుంచబోతున్నారు.
ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రైతు భరోసా పథకానికి ప్రధాని మోదీ పేరు కూడా జత చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని మోదీకి చెప్పి, పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన కోరనున్నారని తెలుస్తోంది. జగన్ ప్రతిపాదనకు మోదీ ఓకే చెబితే.. బీజేపీ నేతలు ఈ విషయంలో జగన్‌ను విమర్శించడానికి ఛాన్స్ ఉండదు.
వైఎస్ఆర్ భరోసాకు మోదీ పేరును జత చేయడం ద్వారా తనకు, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని జగన్ పరోక్షంగా చెప్పినట్టే. అటు టీడీపీ నేతలపై విమర్శలు చేయడంతో పాటు, ఇటు బీజేపీ నేతల నోళ్లు మూయించడానికి జగన్ నిర్ణయం ఉపకరిస్తుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ మోదీ రైతు భరోసా అని ఈ పథకానికి పేరు పెట్టాలని భావిస్తున్నారట. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పేరు ఫైనలయ్యే అవకాశాలున్నాయి.