రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీతో మొదలైన వైరం మరో టర్న్ తీసుకుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేయగా జోక్యం చేసుకున్న కేంద్ర జలశక్తి వనరుల శాఖ రెండు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం సహా ఏడు ప్రాజెక్టులు, ఏపీ పోతిరెడ్డిపాడు విస్తరణ కొత్త ప్రాజెక్టులేనని కేంద్రం తేల్చి చెప్పింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సమర్పించి ఆమోదం పొందే వరకు ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆదేశించింది.
కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టవద్దని కేసీఆర్ కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖ రాశారు. ఈ నెల 11న దిల్లీలో కేంద్రమంత్రిని కేసీఆర్ కలిసిన రోజే లేఖ రావడం గమనార్హం. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎన్నోసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అక్టోబరు 2న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయగా… కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
అయితే, కృష్ణా నదీపరివాహక ప్రాంతంలోని పంచాయితీల పరిష్కారానికి మరో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి తెలిపారు.