పాకిస్తాన్ లోని పంజాబ్ అసెంబ్లీ వద్ద ఆ రాష్ట్ర హోం మంత్రి రానా సనా ఉల్లా పై గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి అయన తన కారులో వెళ్లబోతుండగా.. డ్రైవర్ పక్కనే కూచున్న ఆయనపై ఈ ‘షూ దాడి’ జరిగింది. ఈ బూటు కారు విండ్ స్దీంక్రీన్ పై పడింది. దీంతో డ్రైవర్ ఒక్క క్షణం పాటు కారును ఆపి వెంటనే ముందుకు నడిపాడు. మంత్రిని అనుసరిస్తున్న జర్నలిస్టుల బృందం ఈ ఘటనను చిత్రీకరించింది.
అంతకు ముందు అసెంబ్లీలో సనా ఉల్లాకు, విపక్ష సభ్యులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్టు తెలిసింది. ఏది ఏమైనా ఈ షూ దాడి వీడియోకెక్కి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్ సీఎం పర్వేజ్ ఇలాహి విశ్వాస తీర్మానంపై రాజకీయ గందరగోళం దుమారంగా మారడంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ వర్గానికి, పంజాబ్ సంకీర్ణ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై పెల్లుబికిన ప్రజాగ్రహమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
సభా విశ్వాసాన్ని చూరగొనాలని గవర్నర్ బలిగుర్ రెహ్మాన్ ఆదేశించినప్పటికీ అవి అక్రమ ఉత్తర్వులని, వాటిని అంగీకరించబోమని ఇలాహి ఇటీవల ప్రకటించారు. ఇదే సందర్భంలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ వర్గాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.