దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పశ్చిమ ఢిల్లీలో ఓ కారును గుర్తు తెలియని దుండగులు చుట్టుముట్టి అందులో ఉన్నవారిపై శనివారం రాత్రి కాల్పులు జరిపారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న స్థానిక మండి మాజీ చైర్మన్, అతని సోదరుడు గాయపడ్డారు.
ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై కొంత మంది అక్కడే ఉన్నారు. కాల్పులు ఘటనతో ఒక్క సారిగా వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకుని దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. రద్దీగా ఉన్న సుభాష్ నగర్ పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఓ తెల్లకారు రోడ్డుపై వచ్చి ఆగింది. దీంతో ఇద్దరు దుండగులు వచ్చి కారులో ఉన్న వారిపై తుపాకులు గురిపెట్టారు.
అందరూ చూస్తుండగానే ఒక్క సారిగా కాల్పులు జరిపారు. దీంతో పక్కన ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఇలాంటి ఘటనలు జరగడం షాక్ కు గురిచేస్తోందని అంటున్నారు.