నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. దాహం తీర్చుకునేందుకు వాటర్ బాటిల్ అడిగితే షాప్ యజమాని యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
చైతన్య అనే విద్యార్థి ఓ కాలేజ్ లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. బాగా దాహంగా ఉండడంతో ఎనికేపాడులోని ఓ షాప్ లో వాటర్ బాటిల్ అడిగాడు. కానీ.. షాప్ లో ఉన్న వ్యక్తి నీళ్లకు బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఎంతో దాహంగా ఉండడంతో చైతన్య చూసుకోకుండా గడా గడా యాసిడ్ ను తాడేశాడు.
కాసేపటికే కడుపులో మంటతో అల్లాడిపోయాడు చైతన్య. నీళ్లు తాగితే ఇలా అవుతోందేంటని కంగారు పడ్డాడు. పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. శరీరంలోని అవయవాలపై యాసిడ్ తీవ్ర ప్రభావం చూపించినట్లు తెలిపారు.
చైతన్య వైద్యం కోసం విద్యార్థులు విరాళాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.