సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. మంటలు ఆర్పే క్రమంలో ఏపీఎఫ్ వో ధనుంజయ రెడ్డి, ఫైరింజన్ డ్రైవర్ నర్సింగ రావు అస్వస్థతకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో గురువారం నుంచి ఆచూకీ లభించని ముగ్గురు సజీవదహనం అయ్యారు.
మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా బూడిదయ్యాయి. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దంతాలు తప్ప మరేమి దొరికే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రమాదంలో వసీం, జునైద్, జహీర్ మిస్ అయ్యారు. మృతులు గుజరాత్ కు చెందిన కూలీలుగా అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ స్పందిస్తూ.. ఆరో అంతస్తు నుంచి మంటలు రావడంతోనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం కాదన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యేదన్నారు. కానీ సబ్ స్టేషన్ లో అలా జరగలేదన్నారు. గురువారం ఫోన్ రాగానే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవన్నారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందన్నారు.
అయితే అగ్ని ప్రమాదం జరిగిన భవన యజమాని జావేద్ పరారీలో ఉన్నారు. మంటలు రాగానే భవనం నుంచి 17 మంది బయటకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. సామాగ్రి తెచ్చేందుకు వెళ్లి ముగ్గురు లోపల చిక్కుకు పోయారన్నారు ప్రత్యక్ష సాక్షులు.