కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ఎక్స్ఈ అనేది ఒమిక్రాన్ వేరియంట్ మరో రూపమని ఆయన అన్నారు. కరోనా ఇంకా ముగియలేదని, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
2020లో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి కేంద్రం తీసుకున్న చర్యల గురించి ఆయన మంగళవారం వివరించారు. 12 ఏండ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించే విషయంలో నిపుణుల నిర్ణయం తీసుకోవాలన్నారు.
అతి కొద్ది దేశాలు మాత్రమే 12 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రికాషనరీ డోసు ధరను రూ. 225గా నిర్ణయించడంపై అడిగిన ప్రశ్నకు ఇది గరిష్ఠ ధర అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యాక్సిన్ తయారీదారులు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నందున పోటీ కారణంగా ఆ ధర మరింత తగ్గవచ్చని అన్నారు.
60 ఏండ్లు పైబడిన వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ప్రికాషనరీ డోసులను ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇతరులు వాటిని ప్రైవేట్ సెంటర్లలో తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ దానిని తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. దానికణుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం సలహాలను ఇస్తుంది చెప్పారు.