ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో ఓ విద్యాశాఖ మంత్రి తీహార్ జైలుకు వెళ్లడం, అది కూడా మద్యం కుంభకోణంలో అరెస్టు కావడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు.
ఆప్ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ కేసులో నిందితులకు తగిన శిక్ష పడాలన్నారు. ఇది ఒక ఓపెన్ అండ్ షట్ కేసు అని ఆయన అన్నారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకే ఈ పాలసీని తీసుకు వచ్చారని మండిపడ్డారు. ఆ డబ్బుతో ఖలీస్తాన్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
మద్యం పాలసీలో ఎలాంటి తప్పులు లేకుంటే దాన్ని వెనక్కి తీసుకుని ఉండకూడదన్నారు. ఇది భావోద్వేగ ప్రకటనలు ఇవ్వాల్సిన సమయం కాదన్నారు. సిసోడియా పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులను తెరిచి ఉంటే, వాటిని తమకు చూపించాలన్నారు.
అతను సుప్రీం కోర్టును ఆశ్రయించ వచ్చన్నారు. కానీ తనకు తెలిసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ కుట్రలు బట్టబయలయ్యాయన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈ రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.