దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దావాకర్ హత్య కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ కేసులో 3వేల పేజీల ఛార్జిషీట్ ను పోలీసులు ఇప్పటికే రెడీ చేశారు. ఇందులో 100 మందికి పైగా వాంగ్మూలాలను ఇందులో చేర్చారు. విచారణ సమయంలో సేకరించిన ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు ఇందులో పొందుపరిచారు.
శ్రద్ధను హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నట్టు ఇందులో పేర్కొన్నారు. దీంతో పాటు నిందితుడికి చేసిన నార్కో పరీక్ష, ఫోరెన్సిక్ టెస్టుల నివేదికలను పోలీసులు ఛార్జిషీట్‌లో పొందుపరిచారు. ఈ ఛార్జిషీట్‌ను న్యాయ నిపుణుల సమీక్ష అనంతరం కోర్టులో దాఖలు పరచనున్నారు. ఈ నెలాఖరు లోగా ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు అఫ్తాబ్‌పై 3 వేల పేజీల చార్జిషీట్‌ను ఈ నెలాఖరులోగా దాఖలు చేయనున్నారు. ఛతర్‌పూర్ అడవుల్లో స్వాధీనం చేసుకున్న శ్రద్ధా ఎముకలు, వాటి డీఎన్‌ఏ నివేదికను కూడా పోలీసులు ఇందులో ప్రస్తావించారు. వీటితో పాటు కోర్టుకు అందజేయనున్న నార్కో టెస్ట్ నివేదికలకు కోర్టులో పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని పోలీసులు వర్గాలు తెలిపాయి.
గత ఏడాది మే 18న శ్రద్ధా వాకర్‌ను ఆమె లివింగ్ పార్ట్‌నర్ అఫ్తాబ్ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిజ్ లో నిల్వ చేసి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో విసిరేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధా ఎముకలను స్వాధీనం చేసుకున్నారు.