సాధారణ ప్రజల జీవితాల్నే కాదు, సినీ తారల కెరీర్లను కూడా అల్లకల్లోలం చేసింది కరోనా. మరీ ముఖ్యంగా హీరోల ప్లానింగ్స్ అన్నీ చెల్లాచెదురయ్యాయి. వాళ్ల కాల్షీట్లు వృధా అయ్యాయి. హీరోలు కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకున్నారు. ఇక థియేట్రికల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంత భీభత్సంలో కూడా తనకు కరోనా మంచి చేసిందని అంటోంది శృతిహాసన్.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బ్యూటీ.. పలు మాధ్యమాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇందులో భాగంగా గతేడాది కరోనా టైమ్ లో తన జీవితాన్ని విశ్లేషించుకుంది. తన గురించి తను బాగా తెలుసుకోవడానికి కరోనా/లాక్ డౌన్ టైమ్ బాగా ఉపయోగపడిందని అంటోంది శృతిహాసన్. ఎంత తక్కువలో జీవించొచ్చు, ఉన్నంతలో సర్దుకొని జీవించడం ఎలా లాంటి అంశాల్ని కరోనా వల్ల తెలుసుకున్నానని శృతిహాసన్ తెలిపింది.
ఇక వర్క్ విషయానికొస్తే.. కరోనా వల్ల సినిమాలు ఆగిపోయినప్పటికీ.. తన క్రియేటివ్ సైడ్ ఓపెన్ అయినట్టు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. లాక్ డౌన్ టైమ్ లో తన బుర్రకు పదును పెట్టానని, మంచి ట్యూన్స్ కంపోజ్ చేశానని, మంచి లిరిక్స్ రాశానని చెప్పుకొచ్చింది. ఇక బ్యూటీ పరంగా కూడా మరింత శ్రద్ధ తీసుకున్నట్టు తెలిపింది. పనిమనిషి కూడా లేకపోవడంతో ఇంటి పనులు చేయడంలో తృప్తి, శ్రమ తనకు బాగా తెలిసొచ్చాయని వెల్లడించింది.
మొత్తమ్మీద కరోనా వల్ల తను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని, తనను తాను మరింతగా విశ్లేషించుకోవడానికి కరోనా బాగా హెల్ప్ అయిందని అంటోంది శృతిహాసన్. థర్డ్ వేవ్ అంత ప్రమాదకారి కానప్పటికీ.. అందరూ విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తోంది శృతి.