ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుతూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రగతి భవన్ ముట్టడి సహా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన అభ్యర్థులు పండుగ రోజుల్లో కూడా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. 1600, 800 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించాలని ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల పరిష్కార పోరాట సమితి డిమాండ్ చేసింది.
మహిళా అభ్యర్థులు వినూత్నంగా ముగ్గులు వేసి నిరసన తెలిపారు. 2022 పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఎస్సై, కానిస్టేబుళ్ల భర్తీ నోటిఫికేషన్ లో మార్పులు చేశారని అన్నారు అభ్యర్థులు. తాము మొదటి నుండి ఆ మార్పులను వ్యతిరేకిస్తున్నామని వివరించారు.
ఇలా సవరించడం వల్ల తమకు అన్యాయం జరిగిందని.. ప్రభుత్వం న్యాయం చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.