తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేహదారుడ్య పరీక్షల్లో ఒక సెంమీ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు మరోసారి ఎత్తు కొలవాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్లోని అంబర్ పేట సీపీఎల్ గ్రౌండ్, కొండాపూర్లోని 8వ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.
అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 8 గంటల నుంచి 12న రాత్రి 8 గంటల వరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఆన్లైన్ చేసిన పత్రాలను డౌన్లోడ్ చేసుకొవాలని అధికారులు సూచించారు.
ఎత్తును మరోసారి కొలుస్తున్నందున అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను తీసుకురావాలని బోర్డు సూచించింది. ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్స్ సమయంలో నిర్ణీత ఎత్తుకన్నా 1 సెంమీ తక్కువ ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు.
దీనిపై పోలీసు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు… సదరు అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది. దీంతో ఈ మేరకు పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేసింది.