ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ అభ్యర్థుల సమస్యల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజీగూడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలు పార్టీల నేతలు హాజరై అభ్యర్థుల సమస్యలపై మాట్లాడారు.
ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో లేని నిబంధనలు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు పెట్టడం ఏంటని టీజేఎస్ చీఫ్ కొదండరాం ప్రశ్నించారు. కస్టడిపడి చదివిన విద్యార్థులు కఠిన నియమాల వల్ల ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అరుణోదయ సాంస్కృతిక సారథి విమలక్క డిమాండ్ చేశారు.
అభ్యర్థులెవరూ దైర్యాన్ని కోల్పోవద్దని ఆమె సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో కేసీఆర్ ఎన్నికలకు పోయేందుకు ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. అభ్యర్థుల సమస్యను పరిష్కరించకుంటే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్‌లో నిబంధనలు పెట్టారని అభ్యర్థులు ఆరోపించారు. లాంగ్ జంప్‌ను 4 మీటర్లకు పెంచడంతో చాలా మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని,షార్ట్ పుట్ డిస్టెన్స్ కూడా పెంచడంతో కూడా చాలా మంది డిస్ క్వాలిఫై అయ్యారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాంగ్ జంప్ 3.8 మీటర్లుగానే ఉందన్నారు. కాబట్టి లాంగ్ జంప్, షార్ట్ పుట్ అర్హత తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 6న దున్నపోతులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 7న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాను నిర్వహించనున్నారు. 9న ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు.