అందరి ప్రాణాలు కాపాడి.. ఆస్పత్రి పాలయ్యాడు సూపర్ పోలీస్. హీరోలా ఎంటరై.. సుమారు 25 మంది ప్రాణాలు కాపాడాడు. సినిమా స్టంట్స్ ను తలపించే ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ని నిరసిస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం ప్రగతి భవన్ ని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్ లో ఎక్కించారు. ఆ వ్యాన్ కు కాపలాగా బంజారాహిల్స్ కు చెందిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డితో పాటు కొంతమంది పోలీసులు వ్యాన్ లో వెళ్లారు.
డీసీఎం వ్యాన్ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దిగి నెక్లెస్ రోడ్డు వైపు వస్తుండగా.. ఇంతలో వ్యాన్ డ్రైవర్ రమేష్ కు సడన్ గా ఫిట్స్ వచ్చింది. దీంతో ఆ వాహనం అదుపు తప్పి అటూ ఇటూ తిరుగుతోంది. దీన్ని గమనించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి.. వెంటనే నడుస్తున్న వాహనం నుంచి కిందకు దూకేశారు. ఆ తర్వాత డ్రైవర్ ను పక్కకు గెంటి స్టీరింగ్ పట్టుకోవడం, వెంటనే బ్రేక్ వేయడంతో పూల కుండీని ఢీ కొట్టి పెద్ద కుదుపుతో వ్యాన్ ఆగింది.
ప్రమాద సమయంలో అందులో 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు, కొంతమంది పోలీసులు ఉన్నారు. ఈ ప్రమాద ఘటన సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని తొలగించి, అరెస్ట్ చేసిన వారిని మరో వాహనంలో తీసుకెళ్లారు. ప్రమాదంలో ఎస్ఐతో పాటు హోంగార్డు రమేష్, మరో కానిస్టేబుల్ కు గాయాలవ్వగా.. వారిని యశోద ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.