2015 సంవత్సరం. రాష్ట్రంలోకి సూర్యాపేట మీదుగా సిమీ ఉగ్రవాదులు చొరబడ్డారు. వారి సమాచారం అందుకున్న ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుతో కలిసి వెంబడించే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఉగ్రవాదులిద్దరూ మరణించారు. వారితో పాటు కానిస్టేబుల్ నాగరాజు కూడా మరణించగా, ఎస్ఐ సిద్ధయ్య తీవ్ర గాయాలతో ఎల్.బి నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
వీర మరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య కుటంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించింది. 40లక్షల పరిహారంతో పాటు ఇంటి స్థలం, సిద్ధయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. కానీ 40లక్షలు అయితే అందాయి కానీ ఇంతవరకు ఇంటి స్థలం, ఉద్యోగం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉద్యోగం చేసిన చోట లేదా ఊర్లో ఇంటి స్థలం ఇస్తామని అధికారులు ప్రతిపాదించగా… ఎస్ఐ భార్య హైదరాబాదులో ఇవ్వాలని కోరారు. దీంతో ఆ అంశాన్ని అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
దీంతో తన బాధను సీఎం కేసీఆర్ కు చెప్పుకోవాలని చాలా రోజులుగా ఆ అమరవీరుని భార్య ధరణీష ప్రయత్నిస్తుంది. అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకటం లేదని, తనకు, తన బిడ్డకు కేసీఆర్ న్యాయం చేయాలని కోరుతుంది. అమరుడైన కల్నలో సంతోష్ కుటుంబం లాగే తమకు కూడా న్యాయం చేయాలని కోరుతుంది.