ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ దగ్గర అభ్యర్థులు ఆమరణ దీక్షకు దిగారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అయితే.. పోలీసులు ఆమరణ దీక్షను భగ్నం చేశారు. దీక్షా స్థలికి చేరుకుని అభ్యర్థులను బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరై మాట్లాడారు. ఆర్మీకి నియామకాల్లో లేని నిబంధనలు పోలీసు అభ్యర్థులకు ఎందుకని ప్రశ్నించారు. ఇక ఈనెల 6న దున్నపోతులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు అభ్యర్థులు. 7న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
9న ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. పాత విధానంలోనే కానిస్టేబుల్, ఎస్సై రిక్రూట్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు వీరంతా. దేశంలో 4 మీటర్ల లాంగ్ జంప్ ఎక్కడా లేదని ఆరోపిస్తున్నారు. 200 మార్కుల క్వశ్చన్ పేపర్ లో 20 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని మండిపడుతున్నారు.
పేద విద్యార్థుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారని.. ఆ డబ్బులతోనే రిక్రూట్ మెంట్స్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. లాంగ్ జంప్ కారణంగా వందల మంది కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు అర్హులు కాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.