ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన గదిలోకి వచ్చి.. తనను సీట్లో కూర్చోబెట్టడంపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అతిగా స్పందించారు. ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ కాళ్లమీదపడి అతి గౌరవం ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. కలెక్టర్ చర్యపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెంకట్రామిరెడ్డి తనని సివిల్ సర్వెంట్ అనుకుంటున్నారా లేక.. సీఎం సొంత సర్వెంట్‌ను అనుకుంటున్నారా అని ప్రతిపక్షాలు, ప్రభుత్వ అధికారులు నిలదీస్తున్నారు. ఐఏఎస్ అంటే కేసీఆర్ ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ కాదని.. ప్రభుత్వం తరపున ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన సీటు అన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు. వెంకట్రామిరెడ్డి ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో నూతన జిల్లాగా ఏర్పడిన సిద్దిపేటను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు కూడా ఇలాగే కేసీఆర్ కాళ్ల మీద పడి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు వెంకట్రామిరెడ్డి. దీంతో ఇతర జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు.. ఆ కలెక్టర్లు కూడా ఇలాగే చేయాలన్న సందేశం ఏమైనా వెంకట్రామిరెడ్డి ఇవ్వదలుచుకున్నారా అని సోషల్ మీడియాలో గట్టిగా నిలదీస్తున్నారు.
వెంకట్రామిరెడ్డి ఈ అతి విధేయత అంతా.. రాజకీయాల్లోకి వచ్చేందుకేనన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సీటు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని వెంకట్రామిరెడ్డి అనుకున్నారని.. అందుకోసం వీఆర్ఎస్ కూడా తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. మొన్నా మధ్య దుబ్బాక ఉప ఎన్నికలోనూ అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెంకట్రామిరెడ్డి ప్రయత్నం చేశారన్న వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నోసార్లు ఐఏఎస్‌లు బదిలీ అయినా.. వెంకట్రామిరెడ్డిని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గానే ఏళ్ల తరబడి కొనసాగిస్తుండటంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రయోజనం కోసం ఆయన్ను సిద్దిపేటకే ఫిక్స్ చేశారని తాజాగా తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన వైఎస్ షర్మిల కూడా కేసీఆర్‌ను ప్రశ్నించారు.